0866-2804560

దేవాలయం గురించి

భగవంతుడు దేవతామూర్తుల రూపములలోను, మనుష్యుల రూపములలోను, తదితర విధములుగా అవతరించి, తను తలపెట్టిన లీలా కార్యక్రమాన్ని నడిపించుచున్నాడని ప్రతీతి. శివారాధకులు, తపస్సంపన్నులు, సర్వభూతదయాళులు, బ్రాహ్మణ ఆరాధ్య కుటుంబీకులు అయిన శివలెంక వంశీయపూర్వికులను, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రము నుండి తొట్లవల్లూరుకు రప్పించి, భ్రమరాంబ, మల్లిఖార్జునస్వామి, నందీశ్వరుల ప్రత్యక్ష అవతరణకు, నిమిత్తమాత్రులుగాను, కారణభూతులుగా చేసి, ఈ శివాలయ నిర్మాణము, శివలెంక వంశీయులచే చేయించుటకు ఆయన సంకల్పము, ఆ వంశీయుల పూర్వజన్మ సుకృతము.

1)ఏ పుణ్యపురుషులు, వారి శ్శక్తితో ఎలా స్వామివారిని, అమ్మవారిని, నందీశ్వరుని అవతరింప చేసుకున్నారో తెలియజేసి, వారికి వారు చేసిన సేవకు వారిని స్మరించుకొనేటట్లు చేయుటకు,

2)తపఃశ్శక్తితోనూ, భక్తితత్పరతోను ఎవరైనా భగవంతుని అనుగ్రహము పొందవచ్చని తెలియజేయుటకు,

3)ఇచ్చట దేవతామూర్తుల రూపములోనున్న భగవంతుని, మరింత ధృఢవిశ్వాసముతో భక్తితో ప్రార్థించి ఇహ, పర సౌఖ్యములు పొందుటకు, ఈ స్థలపురాణాన్ని ఈ విధముగా ప్రకటింప చేయమని భగవంతుడు మమ్మల్ని ప్రేరేపించినాడని భావిస్తున్నాము.

ఎలాగయితే గురుచరిత్ర, సాయిబాబా చరిత్ర మొదలగు భగవత్ చరిత్రలు చదివి, ఆ స్థలాల్ని సందర్శించి భక్తి, విశ్వాసములు, శాంతి, సౌఖ్యములు పొందుతారో, ఈ చరిత్ర కూడా చదివి, అవి పొందాలని భగవంతుని వేడుకుంటూ మాకు తెలిసిన చరిత్రను మీకు అందిస్తున్నాము. పూర్వము క్రీ.శ. 15వ శతాబ్దములో, చిత్తూరు జిల్లా, శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రములో ‘శివలెంక’ ఇంటి పేరుగల బ్రాహ్మణ ఆరాధ్యుల (లింగ ధారులు) కుటుంబం ఉండెడిది.

శివలెంక అనగా శివభక్తులు లేక శివసేవకులు అని అర్థము. తదనుగుణముగా, నిత్య శివ పూజోపాసకులుగా, పరోపకార పరాయణులుగా, సర్వ భూతదయాళులుగా, ఆదర్శవంతులుగా పేరు ప్రసిద్ధి గాంచినారు.

ఈ కుటుంబములోని ఒక మహానుభావుడు, నియమ నిష్ఠలతో శ్రీ కాళహస్తీశ్వీరుని గురించి తపస్సు చేయగా ఆయన భక్తికి మెచ్చి, శివుడు, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేతుడై ప్రత్యక్షమయి కోరుకొనమనెను. ఆయన మోక్షకామి కావుటము వలన, శ్రీ కాళహస్తిలోనున్న తమ వంశములోని ఒకూక్కరిని ప్రతి సంవత్సరము శివుని యందు ఐక్యమగునట్లు వరమిమ్మని కోరగా, అట్లే అగుగాక యని వరమొసంగి అంతర్థానమయ్యెను.

అటులే ప్రతి శివరాత్రి రోజున వారి వంశములో ఎవరో ఒకరు లింగైక్యము చెందుట మొదలుపెట్టిరి. ఈ కారణముగా శివలెంక వంశములో పురుషుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కొంతకాలము తరువాత బసవన్నయ్య పేరుగల పురుషుడొకడు మాత్రము మిగిలెను. ఆయన తల్లి ప్రసూనాంబగారు, వంశము నిర్వీర్యమయి పోవునని తలచి, కలతచెంది శివలెంక వారి ఆడపడచుగా ఆరాధిస్తున్న శ్రీ కాళహస్తిలోనున్న జ్ఞాన ప్రసూనాంబను ప్రార్థించి ప్రసన్నురాలిని చేసుకొన్నది.

అంతట అమ్మవారు ఇక్కడున్నంత కాలము, మీ పూర్వీకుల కోరిక ప్రకారము, శివాజ్ఞ ప్రకారము శ్రీ కాళహస్తీశ్వరుడు ఈ క్షేత్రములో ఉన్న మీలో ఒక్కొక్కరిని ఐక్యము చేసుకునుచున్నాడుగాన, ఈ ఊరువదలివెళ్ళి ఇంకొకచోట స్థిరపడమని, ఈ ఉపద్రవము నుండి బయటపడమని చెప్పెను.

అంతట ప్రసూనాంబగారు, ఆ వంశీయుల ఆడపడుచులేని చోట తాము ఉండలేమని చెప్పగా ఆమె భక్తికి మెచ్చి, మందహాసముతో, మీ వంశీయులు ఎక్కడ స్థిరపడుటకు నిశ్చయించుకుంటారో, అక్కడ నేను మీకు దర్శనము ఇస్తూ ఉంటానని చెప్పి అంతర్థానమయినది. ప్రసూనాంబగారు, సంతృప్తిచెంది, ఆ విషయమై అందరికీ చెప్పిన తరువాత. ఊరు వదులుటకు నిశ్చయించినారు.

శ్రీ కాళహస్తిలో ‘గన్నే’ ఇంటిపేరుగల కమ్మవారు శివలెంకవారికి శిశ్రూష చేస్తూ ఉండెడివారు. తాము కూడా గురువులతోనే ఉండెదమని చెప్పి, వారితో బయలుదేరి, అంతట గురు, శిష్య కుటుంబములు రెండూనూ, శ్రీ కాళహస్తిని విడిచి, సంచారము చేయుచూ, భాగవత్ప్రేరణతో కృష్ణానది తీరమున, మంచి తోటలతోనూ, తీగలతోనూ ఉన్న తోట్లవల్లూరు చేరిరి. తోట్లవల్లూరులో స్థిరనివాసము ఏర్పాటు చేసుకొని, శ్రీ బసవన్నయ్యగారు వివాహము చేసుకుని, సంతాన అభివృద్ధిని, ఐహిక సౌఖ్యములను బడిసిరి.

శ్రీ కాళహస్తి క్షేత్రము వదలి వచ్చిన తరువాత ఈశ్వర దర్శనమవటము లేదని, మధనపడుతూ బసవన్నయ్యగారు, శ్రీశైల తీర్థయాత్రకు కుటుంబ సమేతముగా బయలుదేరిరి. తాము బసచేసిన సత్రములో ఈశ్వరుని ధ్యానించుచుండగా, ఈశ్వర సాక్షాత్కారమై నన్ను, నీ వెంట కొనిపోయి నీవున్నచోట ప్రతిష్ఠింపుమని చెప్పెను. అందుకు ఆయన పోషించు సమర్థత లేదని తెలుపగా నీవు ఈ విషయమై చింతింపనక్కరలేదని, నిమిత్తమాత్రుడవై ఉండమని చెప్పి అంతర్థామయ్యెను.

బసవన్నయ్యగారు స్వస్థానము చేరిన తరువాత స్వామివారు స్వప్నములో గోచరించి, నీకు శ్రీశైలములో చెప్పినట్లుగా నా ప్రతిష్ఠకు ముందే నా కుటుంబమును పంపినాను. తోట్లవల్లూరు నందు,ఐదు జమ్మిచెట్లు ఉన్నచోట పూడ్చి ఉన్న బావి దగ్గర త్రవ్విన అమ్మవారి శిలా విగ్రహము, గోచరించునని చెప్పిరి.