0866-2804560

స్వామివారి లీలలు

ఈ వంశమువారు, స్వామివారిని, అమ్మవారిని సేవించుకుంటూ కాలము గడుపుతూ వచ్చినారు. కాలాంతరమున వారిలో అమృతలింగము అయ్యవారనే వారికి ఒక బుద్ధిమాంద్యముతోనున్న బాలుడు జన్మించెను. అతనికి మృత్యుంజయుడను పేరుపెట్టిరి. అతిని బుద్ధిమాంద్యము నుండి విముక్తి గావింపచేసి, శ్రీ నవదుర్గా మహామంత్రమును, శ్రీ మేధాదక్షిణామూర్తి మంత్రములను దీక్షాపూర్వకముగా జపించి తత్ఫలములను కుమారునికి ధారపోసిరి.

తదుపరి, స్వామివారి అనుగ్రహము వలన అతను మేధాసంపన్నుడై, గొప్పపండితుడై, కీర్తి, ప్రతిష్ఠలనార్జించెను. చల్లపల్లి సంస్థానములో ఆస్థానపండితుడై, అభినవ కాళిదాసాది బిరుదులను పొంది, సంస్కృతములో కుమారాభ్యుదయము, చంపాప్రభంధము, ఆంధ్రమున శ్రీదేవి భాగవతము మరియు అనేక గేయములు రచించిరి.

ఈ వంశములోని మూడవ బసవయ్య అయ్యవారు కాలములో అనగా సుమారు 1870 సంవత్సర ప్రాంతంలో ప్రక్కన చూపించిన కళ్యాణ మండపమును కట్టించ ప్రారంభించినప్పుడు, అప్పటి జమీందారుగారు ఇష్టపడకుండెను. అయినను, దీక్షతో మంత్రోపాసనతో, ఒకేరోజు రాత్రి 5 అడుగుల ఎత్తువరకు మండపము కట్టించినారు.

మరునాడు అది చూసి జమీందారుగారు ఆగ్రహముతో బసవయ్య అయ్యవారిని పిలిపించబోగా జమీందారు ఆకారణముగా, అస్వస్థత పొందుటవలన అపచారము చేసినానని భావించి, బసవయ్యగారి వద్దకు వెళ్ళి తీర్థప్రసాదములు పుచ్చుకుని స్వస్థతపొందినారు.

జమీందారుగారు వెంటనే అనుమతినిస్తూ వారి కార్యక్రమమునకు సహాయ, సహకారములు అందించి వారిని గౌరవముగా చూచెడివారు. ఆ కాలములోనే ఆ కళ్యాణమంటపమునకు ప్రక్కనే ఆలయమునకు ఎదురుగా గన్నేవారి సహాయముతో దీపస్తంభము నిర్మించినారు. ఆ కళ్యాణమండపములో ఎన్నో సంవత్సరాలు.

1954 సంవత్సరములో అప్పటి మేనేజింగ్ ట్రస్టీ అయిన శ్రీ శివలెంక వీరేశలింగము అయ్యవారు, కల్యాణములు, హరికథలు, కచేరీలు మున్నగునవి జరుపుటకు అనువుగా ప్రస్తుతమున్న హాలు, ప్రక్కన క్రిందా పైనా కలిపి నాలుగు గదులు నిర్మింపచేసినారు.

ఇదివరకు ఉన్న కళ్యాణమండపము కళ్యాణములు జరుపుటకు అనువుగా లేనందున తదుపరి కళ్యాణములు ఈ హాలులోనే జరుగుచున్నవి.1995సంవత్సర ప్రాంతంలో ఆ కళ్యాణమండపము శిథిలావస్థకు చేరి నిరుపయోగమై పాడుబడి విరిగిపడిపోవు స్థితికి చేరినప్పుడు, నిర్మూలించారు.

దాని ప్రక్కన ఉన్న వాహనశాల కూడా 2004 సంవత్సరంలో శిథిలావస్థకు చేరినది. 2002 జనవరిలో దానిని నిర్మూలించారు. వాహనశాలను క్రొత్తగా ఆలయ ప్రాంగణములోనే నిర్మించినారు. ఇదివరకు కళ్యాణమండపము, వాహనశాల స్థానే ఈ తరము శివలెంకవారు, వారి పైకముతో శివలెంక కళానికేతన్ పేరుతొ, వసతి గృహము, కళావేదిక స్థలము, భ్రమరాంబ, మ్కల్లిఖార్జునస్వామి, నందీశ్వర అవతరణ తెలియజేయుటకు, విజయస్థలి, అను పేరుతొ 2002 సంవత్సరము ఫిబ్రవరిలో సుమారు 4 లక్షల రూపాయలతో వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థము నిర్మించినారు.

సర్వశ్రీ శివలెంక చంద్రశేఖర శాస్త్రిగారు వారి కుమారుడు శరత్ కుమార్, సోదరుడు రామలింగముగారు. అమరవీరేశ్వర శాస్త్రిగారు, వారి సోదరులు దక్షిణామూర్తిగారు, రామమోహనరావు గారు మల్లిఖార్జున వరప్రసాద్ గారు, శివప్రసాద్ శరత్ చంద్ర గారు, వారి కుమారుడు వెంకట అమృతానంద ఆ నిర్మాణమునకై ధనసహాయమును చేసినారు.

శివాలయము ముందున్న ఖాళీస్థలమును దురాక్రమణలకు లోనుకాకుండా పవిత్రముగా ఉంచుటకు 1997 నుండి తలపెట్టిన ఆలయ ప్రాకార నిర్మాణ కార్యక్రమము కొంతమంది గ్రామస్థులు, పంచాయితీ వారు వాహనముల రాకపోకలకు ఇబ్బంది కలుగునని చెప్పడంతో ముందుకు సాగకుండెను.

భగవత్క్రుప వలన 2001 సంవత్సరం జులై నుండి 2001 డిసెంబరు ఆఖరు వరకు కీ.శే. శ్రీ శివలెంక వీరేశలింగము అయ్యవారు గారి జ్యేష్ఠ కుమారుడు శ్రీ అమరవీరేశ్వర శాస్త్రిగారు, ప్రస్తుత ధర్మకర్తల మండలి ఉపాధ్యక్షుల ఆధ్వర్యములో ధర్మకర్తలు తదితర భక్తులు జరిపిన కృషివలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జోక్యముతో, వివాదమునకు తెరపడి, అదే గగ్రామస్థుల, పంచాయితీ వారి సహకారముతో 2002 సంవత్సరం ఫిబ్రవరికి, ఆ ప్రాకారము మూడు ప్రక్కల గేట్లతో శోభాయమానముగా రూపుదిద్దుకున్నది.

శివలెంకవారు, తరతరాలుగా, వారికి బహుమతిగా వచ్చిన ఈనాములు వారి సొంత భూములను సుమారు 97 ఎకరములు వరకు ఆలయ ధూపదీపనైవేద్యములకు దానము చేసినారు. ఇంతవరకు అలాగే ఆ ఆస్తిని కాపాడుతూ వస్తున్నారు.

తదుపరి ప్రతిష్టా కార్యక్రమము : 1954 వ సంవత్సరములో కీ.శే. శ్రీ కానూరు వీరభద్రయ్యగారు నవగ్రహ ప్రతిష్టలు గావించినారు. 1977 సంవత్సరంలో శ్రీ శివలెంక ఉమా మహేశ్వరము అయ్యవారు భద్రకాళి ప్రతిష్ఠ గావించినారు. తదుపరి భద్రకాళీ దేవికి వెండి సర్వాంగభరణము సమర్పించినారు. తదుపరి నాగేంద్రుని ప్రతిష్ఠ కూడా జరిగినది.

13