0866-2804560

శ్రీ నందీశ్వర అవతరణ

శ్రీ బసవన్నయ్య అయ్యవారి తరువాత తరములోని వీరభద్రయ్యవారి కాలములో చాలా మహాత్యములు జరిగినవి. ఒకరోజు వీరభద్రయ్యగారు అభిషేకము చేసుకొనుచుండగా లింగములో బాగా బలముగానున్న కోడెదూడ ప్రతిబింబము కనుపించినది.

ఆ క్రితము రాత్రి స్వప్నములో అమ్మ, అయ్యవార్లు, తమకు వాహనము ఎప్పుడు ఏర్పాటు చేయుచున్నావు అని అడిగిన సంగతి గుర్తుకు తెచ్చుకొని, తనకు దర్శనమునకు వచ్చిన కోడెదూడ సంగతి అమ్మవారికి తెలుపగా, ఇంకెందుకు బావగారి ఆజ్ఞ అయినది, కావున త్వరలోనే ఆ కార్యక్రమము కూడా సిద్ధించునని చెప్పెను.

అదే సమయంలో అధిక సంఖ్యలో చుట్టుప్రక్కల రైతులు ఆయన దగ్గరకు వచ్చి, బలసిన ఒక కోడెదూడ చేతికివచ్చిన పంటను తినివేయుచున్నదని, కన్పించినట్లే కన్పించి మాయమవుతున్నదని , పంట చేతికందటములేదని చెప్పి, వారిని తరుణోపాయము చెప్పమని ప్రార్థించిరి.

మీరెవరూ ఈ రోజురాత్రి మాత్రము కాపలా ఉండవద్దు అని చెప్పిరి. కఠోరదీక్ష పూని నోటిలో మిరయపు గింజను వేసుకుని, వీరభద్రోపాసన చేసి, అర్థరాత్రి సమయములో పల్లకిలో కూర్చుని, భేతాళుడుకు తెలుపగా దెయ్యములు వచ్చి పల్లకిని మోయునట్లు ఏర్పాటుగావించెను.

అంతట, నందీశ్వరుడు ఉన్న చేను దగ్గరకు తీసుకురమ్మని అజ్ఞాపించిరి. అవి వల్లూరుపాలెం, కంకిపాడు మధ్య ఉన్న చేల దరిదాపులకు తీసుకుని వెళ్ళినవి. ఆయన పరిసర ప్రాంతములు చూసుకుని, స్థంబన మంత్రము ప్రయోగించి ఇంటికి వచ్చిరి.

మరునాడు ఉదయము తమ శిష్యులతో రామ, లక్ష్మణులనే ఎద్దులు కట్టిన బండితో, రాత్రి తాను చూసిన చేను దగ్గరకు చేరుకొని, ఆయన ఒక్కరు స్థంబన చేసిన చేనులోకి వెళ్ళి బసవా ఎక్కడ ఉన్నావని గట్టిగ పిలవగా, పడుకొని మేయుచున్న నందీశ్వరుడు వెనుకకు ఓరగా చూస్తుండగా, అయ్యవారు తమ చేతిలోని విభూతిని మంత్రించి వేయగా ఆ కోడెదూడ శిలగా మారిపోయెను.

వెంటనే ఆయన శిష్యులతో తను తీసుకువచ్చిన ఎడ్లబండి మీద అడుగుఅడుగునా, మంత్రోచ్చారణ గావిస్తూ గుడి దగ్గరకు తీసుకుని వచ్చిరి. గుడి ముందర, రాముడు అనే ఎద్దు, రక్తము కక్కుకుని చనిపోయినది.

లోపలకు నందీశ్వరుని తీసుకువచ్చిన తరువాత, లక్ష్మణుడనే ఎద్దు రక్తము కక్కుకుని చనిపోయినది. ఆ రెండూ అటుల లింగైక్యము చెందినవి.తీసుకువచ్చిన నందీశ్వరుని ప్రస్తుతమున్న స్థలములో స్వామివారికి ఎదురుగా ప్రతిష్టించిరి.

16